ఏపీలో నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విధానంపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంరేపాయి.
ఆ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, పవన్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మచిలీపట్నంలో మంత్రి పేర్నినానితో పలువురు టాలీవుడ్ నిర్మాతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆన్లైన్ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై పేర్ని నానితో దిల్ రాజుతో పాటు నిర్మాతలు డివివి దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి, మైత్రి నవీన్ లు చర్చించారు.
సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని నిర్మాతలు చెప్పారని పేర్ని నాని వెల్లడించారు. ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ నడుస్తోందని, ఇది కొత్తదేం కాదని అన్నారు. సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని అన్నారు.
రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్లో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని నాని తెలిపారు. ఒక వ్యక్తి మాటలపై తామంతా ఏకాభిప్రాయంగా లేమని చిరు తనతో అన్నారని వెల్లడించారు.
ఆడియో ఫంక్షన్లో జరిగిన పొరపాటుతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరు చెప్పారని నాని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని పేర్ని నాని తెలిపారు.