చైనా సొంతంగా రూపొందించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి ఏప్రిల్ 29న కోర్ మాడ్యూల్ మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ నియంత్రణ కోల్పోయిన సంగతి తెలిసిందే. అనుకోకుండా నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్ శకలాలు భూమిపైకి శరవేగంగా దూసుకువస్తుండడంతో పెను ముప్పు తప్పదనుకున్నారు. సాంకేతిక లోపంతో భూమిపైకి దూసుకువస్తున్న ఆ రాకెట్ శకలాలు ఏ ప్రాంతంలో పడతాయోనని ప్రపంచ దేశాల ప్రజలంతా హడలిపోయారు.
దీనికితోడు తాము రాకెట్ ప్రయోగించినట్టు చైనా చాలా రోజుల వరకు వెల్లడించలేదు. కరోనాను దాచిపెట్టి మానవాళికి ముప్పు తెచ్చిందన్న అపవాదు మూటగట్టుకున్న చైనా…మరో ముప్పును తేబోతోందని అంతా అనుకున్నారు. అయితే, ఎట్టకేలకు తాము రాకెట్ ప్రయోగించామని అంగీకరించిన చైనా.. రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చైనా చెప్పినట్టుగానే నేడు భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శకలాలు మండిపోయాయి.
హిందూ మహా సముద్రంలో చైనా రాకెట్ శకలాలు పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్ శకలాలు బహిరంగ సముద్ర ప్రాంతంలో రాకెట్ పడినట్లు సీఎంఎస్ఈ పేర్కొంది.మాల్దీవులకు సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఆ శకలాలు కూలిపోయినట్లు హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.