డ్రాగన్ దేశ బుద్ధి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చూపించే విలనిజానికి మించిన రీతిలో ఉండే.. ఈ దేశం తన చుట్టూ ఉన్న ప్రతి దేశంతోనూ ఏదో ఒక లొల్లి పెట్టుకోనిదే నిద్రపోనట్లుగా ఉంటుంది.
ప్రతి విషయంలోనూ అతిని ప్రదర్శించే ఈ దేశం.. గురివిందలా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక విషాదకర పరిణామం చోటు చేసుకున్న వేళ.. అత్యంత సంయమనంతో వ్యవహరించాల్సిన ఈ దేశం.. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం చూస్తే.. చైనా స్థాయి ఇంతేనా? అన్న భావన కలుగక మానదు.
తాజాగా సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురి కావటంపై చులకన వ్యాఖ్యలు చేస్తోంది.
ఆ దేశ అధికార మీడియాగా చెప్పే గ్లోబల్ టైమ్స్ లో ప్రచురితమైన తాజా వ్యాసం చూస్తే.. చైనా చీప్ బుద్ధి ఇట్టే అర్థమవుతుంది. సదరు కథనంలో పేర్కొన్న కీలక వ్యాఖ్యలు చూస్తే..
– భారత సైన్యానికి క్రమ శిక్షణ లేదు. పోరాట సన్నద్ధత లేదు. జనరల్ రావత్ మరణంతో దేశసైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాపై వ్యతిరేకత వ్యక్తం చేసే అత్యున్నత స్థాయి భారతీయ నేత మరణించినప్పటికీ.. చైనా పట్ల దూకుడు వైఖరి మారే అవకాశం లేదని చైనా విశ్లేషకులు చెబుతున్నారు.
– భారతీయ మీడియా చెబుతున్న కారణాల్ని పరిశీలించినప్పుడు ఈ ప్రమాదానికి కారణం.. మానవ తప్పిదమే. రష్యాలో తయారైన ఎంఐ 17 సిరీస్ హెలికాఫ్టర్లు పలు దేశాల్లో కూడా వాడుతున్నారు. క్రమశిక్షణరాహిత్య కల్చర్ కు భారతీయ సైన్యం పెట్టింది పేరు. నిబంధనల్ని భారతీయ దళాలు సరిగా పాటించవు. 2013లో ఒక జలాంతర్గామిలో పేలుడు జరిగింది. 2019లో ఒక విమాన వాహక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది. వీటన్నింటికీ మానవ తప్పిదాలే కారణం.
– జనరల్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదాన్ని నివారించదగినదే. వాతావరణం మెరుగయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేయటం.. పైలట్ మరింత నైపుణ్యంతో జాగ్రత్తగా నడపాల్సింది. గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సింది. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా.. ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ ప్రమాదంతో భారత సైన్యానికి పోరాట సన్నద్ధత లేదని మరోసారి తేలింది. భారత సైన్యానికి ఇదో సాధారణ సమస్య.
– చైనా – భారత్ సరిహద్దు ప్రాంతంలో ఉండే సైన్యానికి ఇదే సమస్య ఉంది. సరిహద్దుల్లోని సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. నిజంగా పోరాటం ప్రారంభమైతే చైనా సైన్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండదు. భారత సైన్యం.. నావికా దళం.. వాయుసేన మధ్య వైరుధ్యాల్ని తొలగించటం కోసం మధ్యవర్తిత్వం వహించటానికి జనరల్ రావత్ ను సీడీఎస్ గా భారత ప్రభుత్వం నియమించింది. జనరల్ రావత్ మరణంతో భారత సైన్యం ఆధునికీకరణ ప్రణాళిక అస్తవ్యస్తమైపోయింది.