భారత్ కు వ్యతిరేకంగా డ్రాగన్ దూకుడు ఏమాత్రం తగ్గటంలేదు. తగ్గకపోగా రోజురోజుకు మరింతగా పెరిగిపోతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో తన సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లను మార్చేయటం సరికొత్త వివాదానికి కారణమైంది. దశాబ్దాలుగా ఉన్న మన గ్రామాల పేర్లను కాదని డ్రాగన్ దేశం కొత్తగా తనిష్టం వచ్చిన చైనా పేర్లను పెట్టేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంటోంది.
తమ అంతర్భాగంలోని రాష్ట్రానికి చైనా పేర్లను మార్చబోతున్నట్లు ప్రకటించటాన్ని మన ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని ప్రాంతమే అంటు ఎప్పటినుండో చైనా గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ రాష్ట్రం భారత్ భూభాగంలోనిదే అనటంలో సందేహంలేదు. కాకపోతే నూరుశాతం ఆచార వ్యవహారాలన్నీ డ్రాగన్ దేశంలో ఉన్నట్లే ఉంటాయి. దీన్ని సాకుగా చూపించే చైనా చాలా కాలంగా గొడవలు చేస్తోంది.
ఇదే విషయమై అరుణాచల్ ప్రదేశ్ లోని కీలకమైన కొందరు వ్యక్తులు తామెప్పటికీ భారత్ లోనే ఉంటామని, చైనాతో ఎలాంటి సంబంధాలు వద్దని గట్టిగానే చెప్పారు. అయినా డ్రాగన్ తన గోల వదలటంలేదు. సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలను నిర్మించేయటం లేదా భారత్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసి గ్రామాలను ఆక్రమించేయటం లాంటి చేష్టలతో రెగ్యులర్ గా మనల్ని రెచ్చగొడుతునే ఉంది.
తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని గ్రామాల పేర్లను మార్చబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 15 గ్రామాలకు చైనా, టిబెట్, రోమన్ అక్షరాలతో పేర్లను పెట్టేసినట్లు చెప్పింది. చైనా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం తర్వాతే 15 గ్రామాలకు కొత్త పేర్లను పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్ధ గ్లోబల్ టైమ్స్ ప్రముఖంగా ప్రకటించింది. మన భూభాగంలోని ప్రాంతాలకు చైనా పేర్లను మార్చేయటం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే చేస్తే కేంద్రప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. మళ్ళీ ఇపుడు అదే కంపు మొదలుపెట్టింది. చైనా దూకుడు చూస్తుంటే ఏదో పద్దతిలో భారత్ తో గొడవలు పడుతునే ఉండాలన్నది ప్లాన్ గా కనబడుతోంది.