ఒక్కో రోగానికి ఒక్కో మందు ఉంటుందన్నది అందరికి తెలిసిందే. కరోనా విషయంలోనూ అంతే. ఈ చిన్న విషయం చైనా పాలకులకు ఎందుకు తెలీటం లేదు? కరోనా మహమ్మారికి పుట్టిల్లుగా చెప్పే చైనాలో.. దాన్ని ఎలా డీల్ చేయాలనే విషయం మీద చైనా ఎందుకు తప్పటడుగులు వేస్తోంది.
ప్రపంచానికి పీడ పట్టించి.. రెండేళ్లు ఆగమాగం చేసేసిన డ్రాగన్ దేశం.. కరోనా విషయంలో ఎలా అయితే వ్యవహరించకూడదో అలానే వ్యవహరిస్తుండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఎవరెన్ని చెప్పినా.. ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనాకు ఉన్నవి రెండే పరిష్కార మార్గాలు.
కరోనా నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదన్నది తేలిపోయిన తర్వాత.. దాన్ని నియంత్రించే రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం.. అందుకు వ్యాక్సినేషన్ సాయం చేస్తుంది. మరో మార్గం.. కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి చెందటం.. అప్పుడు ఆటోమేటిక్ గానే రోగ నిరోధక శక్తి వస్తుంది. రెండో విధానం విన్నంతనే దారుణంగా అనిపిస్తుంది కానీ.. మన దేశాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నప్పుడు మాత్రం.. ఈ రెండు కలగలిసిన కారణంగానే.. మూడో వేవ్ ను ఎదుర్కోగలిగామని చెప్పాలి.
ఇందుకు భిన్నంగా కొవిడ్ జీరో పేరుతో.. కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తటంతో పాటు.. ఇంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయా? అన్న పరిస్థితి ఎదురవుతోంది. కొవిడ్ శాంపిళ్ల సేకరణ పేరుతో దాడులు చేయటం.. బలవంతంగా శాంపిళ్లు తీసుకోవటం.. లాక్ డౌన్ పేరుతో ఇంట్లో ఉండే వారు కూడా సన్నిహితంగా ఉండకుండా డ్రోన్లతో పహరా కాయటం లాంటివి చేష్టలతో చైనీయులు విసిగిపోతున్నారు.
కొవిడ్ శాంపిళ్ల పేరుతో ఇనుప రాడ్లతో బంధిస్తున్న తీరు చూస్తే.. ఇదెక్కడి క్రూరత్వం.. మనషుల్లో ఉండాల్సిన మానవత్వం ప్రాథమికంగా కూడా లేకుండా పోయిందేనన్న భావన కలుగక మానదు. లాక్ డౌన్ ను విధించిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు.. గేట్లకు ఇనుప రాడ్లతో వెల్డింగ్ చేస్తున్నారు. కొవిడ్ కట్టడి పేరుతో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు నిలువెత్తు నిదర్శనంగా ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ నుంచి శాంపిల్ సేకరించేందుకు ఆమెను ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతుంది.
షాంఘై లాంటి నగరాల్లో భారీ ఎత్తున కోవిడ్ టెస్టులు నిర్వహించడం.. ఈ క్రమంలో తన శాంపిల్ ఇచ్చేందుకు నో చెప్పిన ఒక మహిళను బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. ఆమె మీదకి ఎక్కి.. బలవంతంగా ఆమె నోరును తెరిచి.. శాంపిల్ తీసుకుంటున్న తీరు చూస్తే.. మరీ ఇంత క్రూరంగానా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
这个强行检测姿势应该让全世界看一看???????? pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i????????iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
కరోనాకు చెక్ పెడతామన్న పేరుతో చైనా అధికారులు చేస్తున్న ఆరాచకాలపై ఇంత కాలం మౌనంగా ఉన్న చైనీయులు పలువురు.. ఇప్పుడు గళం విప్పుతున్నారు. కొందరు వీధుల్లోకి వచ్చిన నిరసన ప్రదర్శనలు చేస్తుంటే.. మరి కొందరు సోషల్ మీడియాలో గుట్టుగా ప్రభుత్వ విధానాల్ని తూర్పార పడుతూ షాకింగ్ వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ.. ప్రపంచానికి చైనా ఆరాచకాలు ఎంతలా ఉంటాయన్న విషయాన్ని అర్థమయ్యేలా చేస్తున్నారు. ఎప్పటిలానే వీధుల్లోకి వచ్చి నిరసన చేస్తున్న వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తంగా జీరో కొవిడ్ ఏమో కానీ.. అధికారుల దెబ్బకు చైనీయులు మాత్రం కుతకుతలాడిపోతున్నారు.