ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి, ఆయన కార్యదక్షత గురించి ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని చాలా అగ్రదేశాల ప్రజలకు తెలుసు. చంద్రబాబు విజన్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, పాలించే తీరు ఏమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా…సీఎం అయినా…అప్పోజిషన్ లీడర్ అయినా…చంద్రబాబు ఎక్కడున్నా..రాజు లాగానే గౌరవం పొందుతుంటారు. రాజు ఎక్కడున్నా రాజే అనడానికి తాజాగా చైనా అంబాసిడర్ సన్ విడోంగ్ రాసిన లేఖే నిలువెత్తు నిదర్శనం.
చంద్రబాబు కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. దీంతో, చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ సహా పలువురు నేతలు కోరుకున్నారు. అయితే, తాజాగా చైనా రాయబార కార్యాలయం నుండి చంద్రబాబు గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత్ లో చైనా అంబాసిడర్ సన్ విడోంగ్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ చంద్రబాబుకు చైనా సర్కార్ నుంచి లేఖ రావడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనమని టీడీపీ నేతలు కొనియాడుతున్నారు.
చంద్రబాబు ఎక్కడున్నా రాజేనని, అందుకే చైనా ప్రభుత్వం గుర్తు పెట్టుకొని మరీ పరామర్శించిందని అంటున్నారు. కాగా, చంద్రబాబుకు మంగళవారం ఉదయం స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని చంద్రబాబు చెప్పారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారు టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.