పంజాబ్ రాజకీయాల్లో పించ్ హిటింగ్ చేసి సీఎం సీటులో సెటిలైపోవాలన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రయత్నాలు ఫలించడం లేదు.
అమరీందర్ సింగ్‌కు పొగపెట్టిన తరువాత తనకు అడ్డులేదు అనుకున్న తరుణంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీ రూపంలో మోకాలడ్డం పడింది.
ఎలాగోలా అధిష్ఠానాన్ని ఒప్పించి ఇంతవరకు చన్నీ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ఆపినప్పటికీ ఇప్పుడు ఎన్నికల తేదీ దగ్గర పడడంతో రాహుల్ గాంధీ ఆ ప్రకటన చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీ పేరుని ప్రకటించారు రాహుల్ గాంధీ. దీంతో సిద్ధూ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
రాబోయే ఎలక్షన్ లో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు రాహుల్ వెల్లడించారు.
లూథియానాలో జరుగుతున్న కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఇటీవల ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ వ్యాఖ్యలు చేశారు.
గతంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రజలు నిర్ణయిస్తారు అధిష్టానం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఆప్ తన సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
5 రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ లో జరుగనున్న ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్స్ గా పరిగణిస్తున్నాయి రాజకీయ పార్టీలు.