ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు మిగతా దేశాల శాస్త్రవేత్తలు, ప్రజలు కూడా చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ముందుగా శాస్త్రవేత్తలు చెప్పిన విధంగానే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసింది.
చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో తన పేరు లిఖించుకుంది. 5.44 నిమిషాలకు ప్రారంభమైన ల్యాండింగ్ ప్రక్రియ 6.04 నిమిషాలకు ముగిసింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ రోవర్ రెండు వారాలపాటు పరిశోధనలు చేయనుంది. మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులపై పరిశోధన చేయనుంది. చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు, భారతీయులందరికీ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ నుంచి వర్చువల్ గా చంద్రయాన్-3 ప్రయోగాన్ని వర్చువల్ గా వీక్షించారు.
ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయమని మోడీ అన్నారు. చంద్రుడిపై చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అపురూపమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి తొలి అడుగు పడటం మన రాష్ట్రానికి గర్వకారణం అని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ ఘనత సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించిందని, ఇస్రో శాస్త్రవేత్తల అచంచల స్ఫూర్తికి, సంకల్పానికి వందనాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది ఆరంభం మాత్రమే, ఇక ఇస్రోను, మన దేశాన్ని ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు.