తమ్ముళ్ళకు చంద్రబాబునాయుడు సీరియస్ వార్నింగే ఇచ్చారు. ఎన్నికలకు ఎంతో దూరం లేని కారణంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయాల్సిందే అన్నారు. జనాల్లోకి వెళ్ళి పార్టీ విధానాలను ప్రచారం చేయని నేతలను, పార్టీ కోసం కష్టపడని నేతలను పార్టీ భరించదని చంద్రబాబు గట్టిగానే హెచ్చరించారు.
పార్టీ నాయకత్వం సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని అందరూ గుర్తించాలన్నారు. ఎంఎల్ఏలు, లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనిచేయని నేతల విషయంలో పార్టీ కఠినంగా ఉంటుందని గుర్తు చేశారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పార్టీ నేతలందరూ యాక్టివ్ గా పని చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని చెప్పారు. వైసీపీ పాలనలో చేతివృత్తుల వాళ్ళు, రైతుల సమస్యలు, గ్రామాల్లో స్కూళ్ళ మూసివేత లాంటి అనేక సమస్యలపై జనాల్లో అవగాహన కల్పించేట్లు పార్టీ నేతలు చొరవ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
బాబాయ్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటో ప్రజలందరికీ అర్ధమైందన్నారు. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ పై టీడీపీ చేసిన పోరాటాలు ఐదు నియోజకవర్గాల్లో సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. అధికార పార్టీ ఎంఎల్ఏలపై చాలా నియోజకవర్గాల్లో జనాల్లో వ్యతిరేకతున్నట్లు చెప్పారు.
ఒక్క అవకాశమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ కు ఇదే చివరి అవకాశంగా చంద్రబాబు జోస్యం చెప్పారు. తల్లికి చెల్లికే న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడని జనాలంతా చెప్పుకుంటున్నారట.
షెడ్యూల్ ఎన్నికలకు ఎక్కువ కాలం లేదన్న విషయాన్ని నేతలంతా గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటి నుండే నేతలంతా జనాల్లో విస్తృతంగా తిరుగుతు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను, విధానాలను ప్రచారం చేయాలన్నారు.
కష్టపడే నేతలకే పార్టీ కూడా అండగా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇకనుండి రెగ్యులర్ గా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తానని, పార్టీ నేతల పనితీరును గమనిస్తుంటానని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మరి పనిచేయని తమ్ముళ్ళల్లో ఇప్పటికైనా మార్పొస్తుందేమో చూడాలి.