తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఎవరు ఎన్ని పనులున్నా.. ఎంత బిజీగా ఉన్నా.. ఆయా పనులన్నిం టినీ పక్కన పెట్టి పండగ సంబరాల్లో మునిగిపోతారు. మిగిలినవన్నీ తర్వాతే అంటారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఒకవైపు భౌతికంగా తన సొంత గ్రామం నారావారి పల్లెలో పండుగ సంబరాలు చేసుకుంటున్నా.. మానసికంగా మాత్రం ఆయన ఆలోచనలన్నీ..కూడా రాష్ట్రంపైనే ఉండడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధి గురించే ఆయన ఆలోచనలు పరుగులు పెడుతుండడం విశేషం.
నారావారిపల్లెలో నాలుగు సంవత్సరాల తర్వాత నారా, నందమూరి కుటుంబసభ్యులు సంక్రాంతి పండుగకు వచ్చి సందడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు, వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి… పాత వస్తువులను అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ… ఆటపాటలతో సందడి చేశారు.
అయితే..ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించే చెప్పడం గమనార్హం. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి తాను కృషి చేస్తే… ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇటుకపై ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశా. ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద తరహా విధ్వంసం సాగుతోందని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సంక్షేమం లేదని దుయ్యబట్టారు. ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారని, పిల్లల భవిష్యత్తు నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ పరిణామాలను గమనించిన వారు అందుకే చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అయ్యారని అంటున్నారు.