టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఈ రోజు వెల్లడిస్తామని ప్రకటించిన సుప్రీం కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేసింది. దీపావళి సెలవుల తర్వాత తీర్పు వెల్లడిస్తామని దేశపు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 19వరకు సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు కాగా 20న కోర్టు పున:ప్రారంభం కానుంది. దీంతో, ఈ నెల 23వ తేదీలోగా తీర్పు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఇక, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను నవంబరు 30కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 30వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. తొలుత ఈ ముందస్తు బెయిల్ విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. అయితే, చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తనయుడి పెళ్లి నేపథ్యంలో ఆయన మరో తేదీ ఇవ్వాలని కోరారు. దీంతో, 23కు బదులు నవంబర్ 30 వ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా పడింది.