ఏపీ సీఎం చంద్రబాబు విజన్‌కు ఇది తార్కాణం. 2014-19 మధ్య ఆయన వేసిన విత్తనం.. నేడు ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది. అది కూడా దేశంలో ప్రజలకు అత్యంత కీలకమైన `వైద్య కిట్`ను అందుబా టులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన `మంకీపాక్స్`ను ముందుగానే గుర్తించేందుకు ఈ కిట్ దోహద పడనుంది. ప్రస్తతం దీనిపై పరోశోధనలు జరుగుతున్న క్రమంలోనే ఏపీలో ఇది సాకారం కావడం.. మొత్తం చంద్రబాబు క్రెడిట్గానే వైద్య నిపుణులు చెబుతున్నారు.
విషయం ఇదీ..
2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశాఖలో మెడ్ టెక్ జోన్‌ను ఏర్పాటు చేశారు. వైద్య రంగానికి సంబంధించి పరికరాలు.. కిట్లు ఇక్కడ దేశీయ పరిజ్ఞానంతో అత్యంత కారు చౌకకే ఉత్పత్తి చేసేలా. దేశం మొత్తం పంపిణీ చేసేలా ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి జోన్‌కు శ్రీకారం చుట్టారు. ఇలా వచ్చిన కంపెనీలు.. అనేక అంశాల్లో పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా మంకీ పాక్స్ కేసులు దేశంలో పెరుగుతున్న సమయంలో మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ తయారు చేశారు.
దీనిని ఉపయోగించి.. మంకీ పాక్స్ లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చు. సదరు అనుమానిత వ్యక్తిని ఐసోలేషన్ చేయడం ద్వారా ఈ వ్యాధిని మరింతమందికి అంటకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కాగా.. తొలి ఆర్టీపీసీఆర్ కిట్‌ను సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. గుజరాత్ లేదా.. మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సిన మెడ్ టెక్ జోన్‌ను పట్టుబట్టి.. ఏపీకి తీసుకువచ్చామని.. ఇప్పుడు అది దేశం మొత్తానికి ఫలాలు అందిస్తోందని మెడ్ టెక్ జోన్ ప్రతినిధులకు తెలిపారు. కాగా.. ఈ కిట్‌ను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.