ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్న పథకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. అది కూడా.. జగన్ సొంత జిల్లా.. సొంత నియోజకవర్గం కడపలోని పులివెందులలోనే కావడం గమనార్హం. గురువారం రాత్రి పులివెందులలో పర్యటించిన చంద్రబాబు ప్రజాగళం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో తాను 30 ఏళ్లు రాజకీయాలు చేశానన్న చంద్రబాబు ఏనాడూ ఒకరినొకరం అవమానించుకోలేదన్నారు. రాజకీయంగా విభేదించామే తప్ప.. ఏనాడూ పరుషంగా వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదని తెలిపారు.
కానీ, జగన్ మాత్రం వ్యక్తిగత విమర్శలను తాను చేయడమే కాకుండా.. తనకుటుంబ సభ్యులను కూడా అసెంబ్లీలో తిట్టేలా తన ముఠాను ప్రోత్సహించారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ తెచ్చిన నవరత్నాలపై చంద్రబాబు సెటైర్లు వేశారు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? అని జనాలను ప్రశ్నించారు. దీనికి వారు మౌనంగా ఉండడంతో చంద్రబాబే సమాధానం చెప్పారు.
1వ రత్నం – ఇసుక మాఫియా
2వ రత్నం – మద్యం మాఫియా
3వ రత్నం – భూ మాఫియా
4వ రత్నం – మైనింగ్ మాఫియా
5వ రత్నం – హత్యా రాజకీయాలు
6వ రత్నం – ప్రజల ఆస్తుల కబ్జా
7వ రత్నం – ప్రభుత్వ ఉగ్రవాదం- సెటిల్మెంట్లు
8వ రత్నం – ప్రతిపక్షాలపై దాడులు-కేసులు
9వ రత్నం – శవరాజకీయాలు-డ్రామాలు-గులకరాళ్ల నాటకాలు
– అని చంద్రబాబు చెప్పారు. ఇలా చంద్రబాబు వివరిస్తున్న సమయంలో ప్రజల నుంచి ఘొల్లున నవ్వులు వెల్లివిరిశాయి. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ భూమి పంచుతాడే కానీ.. తీసుకోడంట అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. అయితే.. పులివెందులలోని ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్న 360 ఎకరాలు కొట్టేసింది ఎవరని నిలదీశారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో 10 వేల ఎకరాలు దోచుకుంది ఎవరని ప్రశ్నించారు.