ఎస్సీ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం మాదిగ ల కన్నా మాలలే తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో ఈ సమస్య తీవ్రంగా మారి.. మంద కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. చివరకు అనుకూల తీర్పు వచ్చింది. అయితే.. ఏపీలో దీనిని అమలు చేసేందుకు చంద్రబాబుకు చిక్కులు ఉన్నాయి. మెజారిటీగా ఉన్న మాలలు.. ఎస్సీ వర్గీకరణను ఒప్పుకోవడం లేదు. కానీ, సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అంగీకరిస్తున్నారు.
అయితే.. ఇది రాజకీయంగా ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు వదిలేయడంతో చంద్రబాబుకు చిక్కువ చ్చింది. దీంతో ఆయన చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అంటే.. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ఓకే చెబుతున్నా.. దీనిని మాదిగల విషయంలో ఒక విధంగా మాలల విషయంలో మరో విధంగా అమలు చేసేందుకు పావులు కదుపుతూ.. మాస్టర్ ప్లాన్‌ను తెరమీదికి తెచ్చారు. మాలలకు ఆగ్రహం రాకుండా.. మాదిగలు దూరంగా ఉండేలా చంద్రబాబు వ్యూహం రచించారు.
ఏపీలో జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణకు తొలి నుంచీ మద్దతుగా ఉన్న టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ ఎస్సీ నేతలకు సైతం ఇదే విషయాన్ని అంతర్గత భేటీలో చెప్పారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో ఉప కులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలుచేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నారు. దీని ప్రకారం ఏ జిల్లాల్లో ఏ ఉపకులం జనాభా ఎంత ఉంటే అంత దామాషా ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఫలితంగా తక్కువ జనాభా ఉండి ఎక్కువ రిజర్వేషన్లు పొందడం వంటి సమస్యలు ఉత్పన్నంకావనేది చంద్రబాబు ఆలోచన. అంటే.. మాదిగలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తారు. తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను కొనసాగిస్తారు. దీనివల్ల మాలలకు ఎక్కువగా నష్టం కలగకుండా.. అలాగని మాదిగల హక్కులు పోకుండా కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా రు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది వేచి చూడాలి.