విజన్ 2020…ఈ మాట చెప్పగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ మాట చెబితే చాలా మంది నవ్వారు. ఐటీ రంగంలో, టెక్నాలజీలో హైదరాబాద్ కు ప్రపంచ పటంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తానని ఆనాడు చంద్రబాబు అంటే ఆయనది అత్యాశ అన్నారు. బిల్ గేట్స్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి…వాజ్ పేయితో హైటెక్ సిటీ గురించి చర్చిస్తే…అదంతా వృథా ప్రయాస అన్నారు.
కట్ చేస్తే…23 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ప్రపంచ ఐటీ రంగంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. దేశంలోనే ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ అత్యంత సౌకర్యవంతమైన నగరంగా అవతరించింది. అందుకే, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు…పార్టీలకతీతంగా చాలామంది అంగీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు విజన్-2047 అంటూ సరికొత్త నినాదాన్ని కొద్ది నెలల క్రితం అందుకున్న సంగతి తెలిసిందే. ‘టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్: ది నీడ్ టు కీప్ ఫైటింగ్’ అంశంపై కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సదస్సులో చంద్రబాబు వర్చువల్ గా పాల్గొని ఈ విజన్-2047 గురించి మాట్లాడారు. ఇపుడు, దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విజన్-2047 గురించి ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే తాజాగా 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజన్-2047 పై చర్చించేందుకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు… 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు… తనతో కలిసి రావాలని యువతను , మేధావులను ఆహ్వానించారు. తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావాలని యావత్ తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో చంద్రబాబు పాల్గొని విజన్-2047 పై కీలక విషయాలు వెల్లడించనున్నారు.