తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం టీడీపీ అవిర్భావం ఒక రాజకీయ అనివార్యమని ఆయన అన్నారు. జాతీయ భావాలతో సాగే ప్రాంతీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. పార్టీ చారిత్రక ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చేలా టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితమయ్యేలా ఈ వేడుకలుండాలని అన్నారు. ఏపీకి టీడీపీ అవసరం ఏంటో ప్రజలందరికీ వివరించేలా కార్యక్రమాలు కొనసాగాలన్నారు.
కొందరు వ్యక్తుల కోసమో, పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదని, కోసం… ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం….ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు అధికారాన్ని పంచిన పార్టీ మనదని కొనియాడారు. అభివృద్ధి..సంక్షేమం, సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదేనని, పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమేనని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎన్నారై విభాగం 40 దేశాల్లోని 200 నగరాల్లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలను, ఎన్నారైలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత చదివితే ఏపీలో సంక్షేమం అంటే తెలుస్తుందని చెప్పారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు ఎన్టీఆర్ తెచ్చారని గుర్తుచేశారు. పార్టీని ఎంత ఇబ్బంది పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామని, ఏ దేశంలో ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్నారైలు సహకరించాలని కోరారు.
ఇక, టీడీపీ 40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు టీడీపీ ధైర్యం అని.. కార్యకర్తలు బలం అని, పసుపు జెండా పవర్ అని లోకేష్ చెప్పారు. ‘దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత, అభివృద్ధిని పరిచయం చేసింది మా నాన్న. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దాం’ అని లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.