నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు మొదలుకొని తాజాగా రఘురామకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చేవరకు నాటకీయ పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ అరెస్టుపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రఘురామ అరెస్టు వ్యవహారంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అశోక్ భల్లాలకు చంద్రబాబు విడివిడిగా లేఖలు రాశారు.
ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ పద్ధతులతో హింసించడం చరిత్రలో లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అధికారంతో జగన్ రెడ్డి పాల్పడుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. తన అవినీతి, పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని అన్నారు. ఈ కారణంతోనే రఘురామపై అసంబద్ధ కేసులు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు.
సీఐడీ పోలీస్ స్టేషన్లో రఘురామను ముసుగులు కట్టుకొన్న వ్యక్తులు తీవ్రంగా కొట్టి హింసించారని ఆరోపించారు. తమను ప్రశ్నించిన వారిపై వైసీపీ సర్కార్ …రాజద్రోహం, దేశ ద్రోహం కేసులు మోపుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు, వ్యక్తులు, మీడియా సంస్థలపై కూడా ఈ తరహాలోనే కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. అధికారాన్ని దుర్వినియోగంతో పోలీసు వ్యవస్థను ఒక పనిముట్టు మాదిరిగా వాడుకొంటోందని మండిపడ్డారు.
ఈ తీరు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అని, ప్రస్తుత పరిణామాలు రఘురామ ప్రాణాలకు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఆ పరిస్థితి ఏర్పడకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిని చంద్రబాబు కోరారు. అంతకు ముందు రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్కూ చంద్రబాబు ఈ విషయాలను వెల్లడిస్తూ లేఖ రాశారు.