ఇటీవల చిత్తూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై హత్యాయత్నం జరిగిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తనను హత్య చేయాలనుకున్నారని, తన రక్తం కళ్ళచూడాలనే ఉద్దేశంతోనే తనపై రాళ్ల దాడి చేశారని మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తనపైనే దాడి చేసి తనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై కూడా చంద్రబాబు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో జగన్ అరాచక పాలనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు సంచలన లేఖ రాశారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలు ఇటీవల చిత్తూరు జిల్లాలో హింసాత్మక ఘటనల వరకు జగన్ అన్యాయాలను, అరాచకాలను ఎండగడుతూ చంద్రబాబు లేఖ రాయడం దేశ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. తనపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని, తన విశేషాఅధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
జగన్ పాలనలో హింస, అరాచకం, మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నాయని, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి పైశాచికానందం పొందుతున్నారని ఆరోపించారు. మతిస్థిమితం లేని జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను రకరకాల మార్గాలతో తప్పించుకుంటున్న జగన్…కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో జడ్జిలు, లాయర్లపై జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, ఆ వ్యవహారంపై సీబీఐ విచారణకు న్యాయవ్యవస్థ ఆదేశించిందని గుర్తు చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో వాలంటీర్లను వాడుకుంటున్నారని, వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా హిందూయేతర వ్యక్తిని జగన్ ఎన్నోసార్లు నియమించారని, జగన్ పాలనలో 250కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ హింసకు గురిచేశారని మండిపడ్డారు.
ఇక, సినీ రంగ సమస్యలను ప్రస్తావించిన పద్మభూషణ్ చిరంజీవిపై, హైదరాబాద్ అభివృద్ధికి కారణం చంద్రబాబు అని చెప్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలను జగన్ ఉసిగొలిపారని ఆరోపించారు. 9 పేజీల లేఖకు 75 పేజీల అనుబంధ డాక్యుమెంట్ ను జత చేసిన చంద్రబాబు….ఈ నాలుగున్నరేళ్లలో జగన్ అరాచకాలను పూసుకొచ్చినట్టుగా ప్రధాని, రాష్ట్రపతికి వివరించారు.