ఏపీలో వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. అయినా సరే టీడీపీ నేతలే వాలంటీర్లపై ఫిర్యాదు చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా టీడీపీపై బురదజల్లుతున్నారని, ఈసీ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఆపాదించడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోన తాజాగా ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు.
పెన్షన్ల పంపిణీ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈసీని ఆయన కోరారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే సచివాలయ, ఇతర సిబ్బంది వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్ల పంపిణీపై సెర్ప్ సీఈవో కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు కావాలనే పెన్షన్లు ఆలస్యం చేస్తున్నారని, టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.