పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచామంటూ వైసీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీలో చేరాలంటూ టీడీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడి బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం వారు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు రాఘవ పైనా, అతని కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.
అంతేకాకుండా, తమపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, వారు పక్షపాతం లేకుండా విధులు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీదేనని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని డీజీపీ కాపాడతారని ఆశిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
కాగా, ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. కేంద్రం స్పందించకుంటే ‘జై ఆంధ్ర ఉద్యమం’ తప్పదన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు రామ్ స్వయంగా వినతిపత్రాలను అందజేశారు. ఓటర్లను సమాధి చేస్తామని విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గండిగుండంలో స్థానిక నాయకుడు శ్రీనివాసరావు ఓటర్లను బెదిరించారని ఆరోపించారు. చంద్రబాబును, తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.