అభ్యర్ధుల జాబితా విడుదలపై చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల నాలుగోవారంలో మొత్తం 175 సీట్లలో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితాను ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. నిజానికి ఈనెల 14వ తేదీన మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే జనసేనతో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. దీన్ని తొందరగా పూర్తిచేసి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు చాలా స్పీడుగా కసరత్తు చేస్తున్నారు. ఇంతలో సడెన్ డెవలప్మెంట్ జరిగింది.
పొత్తులో బీజేపీ కూడా చేరే అవకాశముందనే సంకేతాలు కనబడుతున్నాయి. పొత్తులపై మాట్లాడేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వాళ్ళమధ్య చర్చలు ఏమి జరిగాయన్న విషయంపై క్లారిటి లేదు కాని పొత్తు విషయం ఫైనల్ అయ్యేందుకు మరో పదిరోజులు పట్టేట్లుంది. అందుకనే 14వ తేదీన విడుదల చేయాలని అనుకున్న మొదటి జాబితా మరింత ఆలస్యమయ్యేట్లుంది. జనసేనకు 25 సీట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు ప్రతిపాదించారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయమే ఇంకా ఫైనల్ కాలేదు.
ఇంతలో మధ్యలో బీజేపీ కూడా దూరింది. దాంతో పవన్ తో చర్చలను చంద్రబాబు వాయిదావేశారు. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఫైనల్ అవ్వాలి, సీట్ల సంఖ్య, నియోజకవర్గాలేవో తేలాలి. బీజేపీ విషయం తేలకుండా జనసేన సీట్లు తేలదు. అందుకనే మొత్తానికి మరో పదిరోజులు వాయిదా వేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఆలస్యమైపోతోంది కాబట్టి ఈనెల నాలుగో వారంలోగా మిత్రపక్షాలను కలుపుకుని మొత్తం 175 సీట్లను ఒకేసారి ప్రకటించేయాలని చంద్రబాబు అనుకున్నారట.
ఏక జాబితాగా సీట్లు, అభ్యర్ధులను ప్రకటిస్తే కాని అసంతృప్తులను సర్దుబాటు చేసుకునేందుకు, అభ్యర్ధుల ప్రచారానికి సమయం సరిపోదు. ఎందుకంటే మార్చి 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా నోటిపికేషన్ విడుదల కావచ్చని అంటున్నారు. ఈలోగా జాబితాను ప్రకటించేసి అభ్యర్ధులను ప్రచారానికి దింపకపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయం. అందుకనే అన్నీ సమస్యలను, పరిష్కారాలను ఆలోచించుకునే 175 సీట్లను ఒకేసారి రిలీజ్ చేసేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.