ఏపీలో పెన్షన్ పంపిణీతో పాటు ప్రజలకు నేరుగా నగదును అందించే కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, టిడిపి కక్షగట్టి పేదలకు పెన్షన్ అందుకుండా చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, కుట్రపూరితంగానే పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం ఆలస్యంగా పంపిణీ చేస్తుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. టిడిపి నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
లబ్ధిదారులకు డోర్ టు డోర్ పెన్షన్ అందించేలా చూడాలని, ఈ విషయంపై ఆయా జిల్లాల కలెక్టర్లను టిడిపి నేతలు, కార్యకర్తలు కలిసి రిక్వెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పేదలకు పెన్షన్లు ఇప్పించే వరకు టిడిపి నేతలు విశ్రమించవద్దని అన్నారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా కోర్టులో జగన్ ను దోషిగా నిలబెట్టాలని దిశానిర్దేశం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని అన్నారు.
ఈ రెండు నెలలు పెన్షన్ అందకుంటే అది కూడా కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తామని ప్రజలకు చెప్పాలని సూచించారు. వాలంటీర్లపై ఈసీ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు 13,000 కోట్ల రూపాయలు జగన్ దోచి పెట్టారని, గత 15 రోజుల్లో ఎవరికి ఏ బిల్లులు ఎంత ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా స్పందించారు. ఇళ్ల వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు. సచివాలయ సిబ్బందిని ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసినందుకు వినియోగించుకోవాలని సూచించారు. పెన్షన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు, ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబుతో పాటు టిడిపి నేతలు వర్ల రామయ్య తదితరులు వినతి పత్రం అందించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయవచ్చని వారు చెప్పారు. ఐదో తేదీలోపు పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని కోరారు. అయితే, టిడిపి నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సి ఎస్…. కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.