టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శన కోసం రాయలసీమలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నంద్యాలలోని నందికొట్కూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు…మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గిస్తామంటూ మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు చంద్రబాబు. అంతేకాదు, జగన్ పాలనలో నాసిరకం మద్యం తాగి ఎందరో ప్రాణాలమీదకు తెచ్చుకున్నారని, మరికొందరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో 6 నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని అన్నారు. ప్రజల బతుకులకు న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో నియోజకవర్గానికో సైకో తయారవుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదని, తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. జగన్ సీమ ద్రోహి అని అందుకే సాగునీటి ప్రాజెక్టులపై తాను యుద్ధభేరి ప్రకటించానని ఆయన అన్నారు.
టీడీపీ అధికారం చేపట్టాక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తానని, జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. రోడ్డుకు మట్టి వేయలేని జగన్ మూడు రాజధానులు కడతాడంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు గ్యారెంటీనిచ్చారు.