టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జిల్లాల యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన విజయవంతం కావడంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసిపి నేతలు అనేక ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు.
అయితే, వైసిపి ఊహించని స్థాయిలో చంద్రబాబు పర్యటనలు విజయవంతమయ్యాయని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు పర్యటనను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, చంద్రబాబు పర్యటనలు సక్సెస్ కావడంతో ఈ విషయం అర్థమైందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మూడు రోజుల ఉత్తరాంధ్ర టూర్ సందర్భంగా పోలీసు సిబ్బంది, అధికారులు అందించిన సేవలు అభినందనీయమని అశోక్ గజపతిరాజు అన్నారు.
కాగా, చంద్రబాబు పర్యటనలకు వస్తున్న అనూహ్య స్పందన చూసి వైసిపి నేతల గుండెల్లో పుట్టింది. అందుకే చంద్రబాబు నెల్లూరు టూర్ లో అడ్డంకులు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావలిలో చంద్రబాబు పర్యటించనున్న సందర్భంగా టిడిపి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కావలి మున్సిపల్ కమిషనర్ శివా రెడ్డి తొలగించడం సంచలనం రేపుతోంది. కావలి పట్టణంలో ఉన్న వైసిపి ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం టార్గెట్ చేసి మరీ టిడిపి ఫ్లెక్సీలను తొలగించడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి ఈ తరహా ఫ్లెక్సీల వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి ఏమీ కాదు.