ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పర్యటనలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతపురంతోపాటు సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలోని కమలాపురంలో సైతం చంద్రబాబు జనం నీరాజనం పట్టారు. చంద్రబాబు పర్యటించిన ప్రతి చోటా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం కోసం పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రసంగం వినేందుకు ఎక్కడికక్కడ జనం భారీగా తరలివచ్చారు.
ఇలా, చంద్రబాబు టూర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేనంత స్పందన ఈ సారి వచ్చిందని, ఇది ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందనడానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఆ టూర్ ఇచ్చిన జోష్ తోనే చంద్రబాబు తాజాగా మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు.
‘ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా’ పేరుతో చంద్రబాబు రేపటి నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభించనున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న తొలి మహానాడుతో ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మహానాడులను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాల్లో జరిగే మహానాడుల్లోనూ చంద్రబాబు స్వయంగా పాలుపంచుకోనున్నారు.
జగన్ అసమర్థ పాలన, ఏపీలో నానాటికీ పెరుగుతున్న అప్పులు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు జిల్లాల పర్యటనలు కొనసాగనున్నాయి. వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని, ఈ పాలన నుంచి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చంద్రబాబు ప్రసంగాలు ఉండబోతున్నాయి. ప్రతి జిల్లాల్లో చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించనున్నారు.
ఆయా జిల్లాల్లో తొలి రోజు మహానాడు, రెండో రోజు పార్లమెంటు పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం, మూడో రోజు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇలా, రేపటి నుంచి ఏడాది పాటు చంద్రబాబు దాదాపు వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.