టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు రెండు కోర్టులోనూ చుక్కెదురైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వ్యవహారంపై విచారణ కూడా రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు జడ్జి సెలవుపై వెళ్లడంతో…ఇన్చార్జి జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సత్యానందం ఆ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేశారు. విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న సత్యానందం విజయవాడ ఏసీబీ కోర్టు ఇన్చార్జి జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ అంశాన్ని జడ్జి సత్యానందం ముందు చంద్రబాబు తరఫు లాయర్లు ప్రస్తావించగా…రేపు ఆ ప్రస్తావన తేవాలని సూచించారు. ఇక, స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగే అవకాశముండగా, స్పెషల్ బెంచ్ సమావేశం నేపథ్యంలో రేపటికి వాయిదా పడింది. కొత్త పిటిషన్ల ప్రస్తావనలకు సీజేఐ డీవై చంద్రచూడ్ అనుమతించకపోవడంతో చంద్రబాబు పిటిషన్ ప్రస్తావన జాబితాలో చేరలేదు.
రేపు విచారణకు అనుమతించాలని సీజేఐని చంద్రబాబు తరఫున లాయర్లు కోరడంతో ప్రస్తావన అవసరం లేకుండానే రేపు చంద్రబాబు పిటిషన్ విచారణ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ అనుమతించారని తెలుస్తోంది. ఇక, అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.