ఏపీలో తమ ప్రభుత్వం టెక్నాలజీ కి ఇంపార్టెన్స్ ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, తదితర అధునాతన టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ప్రభుత్వం లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. సాంకేతిక వ్యవస్థ అన్నాక.. కొన్ని ఇబ్బందులు వస్తాయని.. వాటిని అధిగమించి ముందుకు సాగాల్సి ఉందని బాబు అభిప్రాయపడ్డారు.
తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. గతంలో ఎన్డీయే కూటమి సర్కారులోనూ తాము భాగస్వామ్యంగా ఉన్నామని.. అప్పట్లో దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు నిర్మించినట్టు తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా మహా యజ్ఞం మాదిరిగా ముందుకు సాగినట్టు తెలిపారు. తద్వారా పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇక, ఇప్పుడు కూడా ఎన్డీయే కూటమిలోనే ఉన్నామని. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో మౌలిక వనరులు, యువ సంపద అధికంగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ హయాంలో పెట్టుబడులకు మంచి వాతావరణం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా, సమస్య లున్నాయని టెక్నాలజీని దూరంగా పెట్టలేమని వ్యాఖ్యానించారు. చాట్ జీపీటీ, ఏఐ వంటి టెక్నాలజీ లను సమర్థవంతంగా వాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఆదిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.