తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల అన్ని జిల్లాల నేతలతోనూ అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ క్రమంలోనే షర్మిల పెట్టబోయే పార్టీని తెలంగాణలోని పలు పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పెట్టబోతోన్న పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ పెడుతున్నానని షర్మిల చెబుతున్నారని, కానీ, ఏ2 మాత్రం లేదంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్.. షర్మిల పార్టీపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారని, బాబాయ్ హత్య కేసు ఇంకా తేల్చ లేదని విమర్శించారు. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని, నాడు వివేకా కూతురు… నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆనాడు సీబీఐ కావాలన్న జగన్…సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారని గుర్తు చేశారు.
పంచాయతీ ఎన్నికల తొలి దశలో టీడీపీ మంచి ఫలితాలు రాబట్టిందని, అయినా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. 94 శాతం స్థానాలు గెలుస్తున్నామని బొత్స అంటున్నారని, టీడీపీ ప్లాప్ అయిందని చెబుతున్నారని గుర్తు చేశారు. కానీ, ఏ2 విజయసాయిరెడ్డి ‘గెలుపు.. ఓటమి సహజం.. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది.. ఓటమి ఆలోచనను ఇస్తుంది అంటూ ట్వీట్ చేశారని గుర్తు చేశారు.
ఈ రెండు ప్రకటనలకు పొంతన లేకపోవడంపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు బుద్ధుందా అని ప్రశ్నించిన చంద్రబాబు….వారికిప్పుడే జ్ఞానోదయం అయిందన్నారు. టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని చురకలంటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మిగిలిన మూడు దశల్లోనూ ఇదే దూకుడు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.