2024లో జరగబోతున్న శాసనసభ ఎన్నికల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సన్నాహాలు మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి 5 నుంచి 29 వరకు ‘రా కదలిరా’ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జరిగిన తొలి సభలో వైసీపీ నేతలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను తిడితేనే వైసీపీ నేతలకు జగన్ సీట్లు ఇస్తుంటారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ట్రాన్స్ఫర్లు చూడలేదని, ఆ పనిచేస్తున్న జగన్ వంటి ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నానని ఎద్దేవా చేశారు. కనిగిరిలో పెద్ద ఎమ్మెల్యే ఒకరున్నారని, ఆయన బుర్రా మధుసూదన్ కాదని, ‘మనీ’ మధుసూదన్ అని ఎద్దేవా చేశారు. ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో టిడ్కో ఇళ్లకు వైసీపీ నేతలు రంగులు వేసుకున్నారని, కానీ ఇళ్లు మాత్రం పూర్తి చేయలేకపోయారని సెటైర్లు చేశారు.
ఆ ఇళ్లు పూర్తి చేసి వాటిని ప్రజలకు అప్పగించే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు ఆక్వా, గ్రానైట్, ఫార్మా పరిశ్రమలు తీసుకొస్తామని, స్థానికంగానే యువతకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక, జగన్ ప్రభుత్వం తెచ్చిన భూ రక్షా చట్టం ప్రమాదకరమైనదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు చేసిన భూ కుంభకోణాలపై సిట్ వేస్తామని చంద్రబాబు చెప్పారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం వినూత్న పద్ధతిని అవలంబించబోతున్నానని, తనతోపాటు అందరూ టీడీపీ ఎమ్మెల్యేల గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే కుప్పంలో తాను బాగా పనిచేస్తున్నానా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నానా? కుప్పం ఎమ్మెల్యేగా తాను ఉండాలో వద్దో చెప్పండి అంటూ తన నియోజకవర్గ ప్రజలకు ఐ వి ఆర్ ఎస్ సందేశం పంపించబోతున్నానని అన్నారు.
ఆ సందేశం వచ్చినప్పుడు ప్రజలు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని అన్నారు. దానివల్ల సరైన నాయకత్వం, బాధ్యతగల నాయకులు వస్తారని చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం జరగాలని, ప్రజాభిప్రాయం ప్రకారం తమ తప్పులేమన్నా ఉంటే సరిదిద్దుకుంటామని అన్నారు.