“నా రాజకీయ జీవితంలో ఇంతగా ఎప్పుడూ.. ఒక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా ఉండవల్లిలోని తననివాసంలో టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తానెప్పుడూ ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తాను ఐవీఆర్ ఎస్ ద్వారా.. సర్వే స్వయంగా చేశానని తెలిపారు. మొత్తం కోటి మంది ప్రజలకు పైగా అభిప్రాయాలు సేకరించానని చెప్పారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టికెట్లు కేటాయించామని తెలిపారు. టీడీపీలో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. గెలుపుగుర్రాలను ఒడిసి పట్టినట్టు చెప్పారు. దీనికిగాను చాలా కసరత్తే చేశాననిచంద్రబాబు చెప్పుకొచ్చారు.
పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయారన్నారు. వారందరినీ పిలిపించి మాట్లాడుతానన్నారు. వారందరికీ పార్టీ బాధ్యతలు ప్రస్తుతం అప్పగిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశానన్నారు.
కొత్త వారికి 23 మందిని అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు. బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతు న్నాయన్నారు. త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. మిగతా జాబితా కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఇన్చార్జిలు, సమన్వయకర్తలను ప్రకటించిందన్నారు. టీడీపీ నేరుగా అభ్యర్థులను ప్రకటించిందని చంద్రబాబు విమర్శించారు. తాము ప్రకటించిన జాబితాను మార్చేది లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం గమనార్హం.