నారావారిపల్లెలో నిర్వహించిన భోగి వేడుకలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, ఇటీవల జగన్ సర్కార్ తెచ్చిన జీవో నెంబర్ ఒకటి ప్రతిని భోగి మంటలలో వేసి తగులబెట్టి తన నిరసనను చంద్రబాబు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను భోగిమంటల్లో వేసి బూడిద చేశామని, రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని భోగినాడు తాను మనస్పూర్తిగా కోరుకున్నట్టు చంద్రబాబు అన్నారు.
తెలుగు రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములుదని, తెలుగువారికి ఆత్మ గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత అన్నగారు నందమూరి తారక రామారావుది అని చంద్రబాబు ప్రశంసించారు. గతంలో తాను ప్రోత్సహించిన ఐటీ సెక్టార్ ఉత్తమ ఫలితాలను ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగు సినిమాకు దేశంలో వచ్చే ఆదాయానికి సమానంగా ఓవర్సీస్ లోను ఆదాయం వస్తోందని, దీన్నిబట్టి తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో విస్తరించారో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.
కొందరు ఈ రోజు కోసం బతుకుతారని, మరికొందరు రేపటి కోసం బతుకుతారని, తాను ప్రజల భవిష్యత్తు కోసం బతుకుతానని చంద్రబాబు అన్నారు. 2047 వరకు ఒక విజన్ సిద్ధం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి జి20 సమావేశాల సందర్భంగా సూచించానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజావేదికతో జగన్ విధ్వంసకర పాలన ప్రారంభమైందని, పెట్రోలు కరెంటు ధరలు ఇలా పెంచుకుంటూ ఆ పాలన కొనసాగుతోందని విమర్శించారు.
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట కుట్ర ప్రభుత్వానిదేనని చంద్రబాబు ఆరోపించారు. అయితే, జగన్ పై తనకు ఎలాంటి ద్వేషం లేదని, జగన్ తండ్రి వైయస్సార్ తనకు స్నేహితుడిని చంద్రబాబు చెప్పారు. జగన్ పాలనతో ఏపీ బ్రాండ్ నేమ్ పూర్తిగా దెబ్బతిందని, నాణ్యతలేని మద్యాన్ని విక్రయిస్తూ పేదల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. దుర్మార్గాలు చేస్తున్న ప్రతి ఒక్కరి లెక్క రాసి పెడుతున్నానని వార్నింగ్ ఇచ్చారు.
5 కోట్ల మంది ఆంధ్రులకు, జగన్ కు మధ్య రాబోయే ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. పవన్ పై వైసీపీ నేతలు సభ్యత లేకుండా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉండేందుకు జగన్ కు అర్హత లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.