ఏపీసీఎం, వైసీపీ అదినేత జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. “జగన్ బచ్చా.. నా జోలికి వచ్చాడు.. నేనేంటో చూపిస్తా“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. “ఈ 40 ఏళ్ల కెరీర్ లో నాలాంటి వాడి జోలికి ఎవడూ రాలేదు. ఈ బచ్చా నా జోలికి వచ్చాడు. నేనేంటో చూపిస్తా. వదిలిపెట్టేది లేదు. చరిత్రలో ఆయన స్థానం ఏంటో చూపిస్తా. కుమిలి పోయేలా చేస్తా. చంద్రబాబు జోలికి, మా తమ్ముళ్ల జోలికి ఎందుకు వచ్చానా? అంటూ మథనపడిపోయేలా చేస్తా“ అని చంద్రబాబు తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు.
“జగన్ చేసింది ఏంటయ్యా అంటే.. రూ.13 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. అంటే.. ఆయన గెలిచింది .. పాలన చేయడానికి కాదు.. అప్పులు చేయడానికి. మన నెత్తిన అప్పుల కుంపటి పెట్టడానికే. నిన్ననే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది. ఇవాళ ఐదో తారీకు ఉద్యోగులకు జీతాలు వచ్చాయా? రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు వచ్చాయా? నిన్న కూడా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి, శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్. శవ రాజకీయం అనేది వైసీపీ డీఎన్ఏలోనే ఉంది. తండ్రి చనిపోతే, తండ్రి లేని బిడ్డను అంటూ సానుభూతి పొందాడు. బాబాయ్ ని ఈయనే చంపేసి, మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు. నాకే ఓటేయండి అన్నాడు. ఈయనను చూస్తే నాకు పాత సినిమాల్లో విలన్ నాగభూషణం గుర్తుకు వస్తాడు“ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏపీ బాగుపడాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని, రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి ఈ జలగ జగన్ మోహన్ రెడ్డికి లేదని చంద్రబాబు విమర్శించారు. “రాష్ట్రంలో రైతులు దీనావస్థలో ఉన్నారు, రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. దేశంలోని మిగతా చోట్ల అప్పుల బాధ తక్కువగా ఉంది. కానీ ఏపీలో రైతుల్లో 93 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాదే. రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాం. కోస్తాలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశాం“ అని గత సంగతులను చంద్రబాబు వివరించారు.