తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. చంద్రబాబు రంగంలోకి దిగడంతో బెదిరిపోయిన వైసీపీ నేతలు కుటిల రాజకీయాలకు తెరతీశారని ఆరోపణలు వస్తున్నాయి. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబుకు వస్తున్న జనాదరణ ఓర్వలేకే చంద్రబాబు రోడ్ షోపై రాళ్లదాడి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై జరిగిన రాళ్లదాడి ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. అలిపిరి ఘటనలో మైన్స్‌కు భయపడలేదని, ఈ గులకరాళ్లకు భయపడతానా…?అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను అనుకుంటే ఒక్కరూ బయటకు వచ్చేవాళ్లు కాదని, రౌడీల తోకలు కట్ చేస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చే తిరుపతి శోభ పూర్తిగా తగ్గిపోవడానికి ఈ తరహా ఘటనలు దోహదపడతాయని అన్నారు. వైసీపీవి నవరత్నాలు కావవి.. నవ మోసాలని వాటిపై నమ్మకం ఉంటే… చేతకాని మనుషుల్లాగా ఈ రౌడీయిజం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని, పార్టీకి తిరుపతి కంచుకోట అని ఆయన అన్నారు.
తిరుపతి టీడీపీ నేతల ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. తిరుపతిలో గత రెండేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కు నమూనాగా ఇక్కడ పార్క్ నిర్మించాలని అనుకున్నామని, తెలుగు గంగ నీళ్లుతెచ్చామని, కొండపైకి నీళ్లు తీసుకెళ్లామని అన్నారు.
కండలేరు ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేశామని, తిరుమల పవిత్రతను కాపాడామని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌తో పాటు తాను, పార్టీ నాయకులు.. ఎవరు తిరుపతి వచ్చినా… పవిత్ర భావంతో స్వామివారి దర్శనం చేసుకునే వాళ్లమని, అధికార దుర్వినియోగానికి ఏనాడూ పాల్పడలేదని అన్నారు. అపచారానికి దూరంగా ఉన్నామని అన్నారు.