ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాలనను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు జగన్ వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిన పెడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నూతన ఇసుక పాలసీ ప్రకారం ప్రజలకు ఉచిత ఇసుక, నూతన మద్యం పాలసీ ప్రకారం తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన టీడీపీ నేతల సమావేశంలో మద్యం వ్యాపారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇసుక, లిక్కర్ వ్యాపారాల జోలికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ నేతలు వెళ్లొద్దని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు వంటి వారికి సడలింపులున్నాయని, వారి కుటుంబం వారసత్వంగా చాలా సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలో ఉందని చెప్పారు. ఆ రకంగా వారసత్వంగా మద్యం వ్యాపారం చేసే వారు కంటిన్యూ చేయొచ్చని, అయితే, కొత్తగా డబ్బులు సంపాదిద్దామని ఆ వ్యాపారంలోకి పోవొద్దని సున్నితంగా హెచ్చరించారు.
పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలని, కార్యకర్త తప్పు చేసినా…సీఎంపై ప్రభావం పడే పరిస్థితి ఉందని, అలా జరగడం వల్ల పార్టీ నష్టపోతుందని అన్నారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో ఓటు వేశారని, మిగతా భాగస్వామ్య పార్టీలను కలుపుకొని సమన్వయంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినట్లు మనం చేయకూడదని, అలా చేస్తే రాష్టం రావణ కాష్టంగా మారుతుందని అన్నారు.