వైసీపీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తూ అనేక సార్లు కోర్టు బోనులో నిలబడిన ఏపీ డీజీపీ తన దారిని మార్చుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం ఆఫీసులపై దాడి జరుగతుందని ఆయనకు ఇంటెలిజెన్స్ సమాచారం రాకుండా ఎందుకు ఉంటుందని తెలుగుదేశం నేతలు నిలదీస్తున్నారు. ఆయనకు తెలిసినా అడ్డుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దాడికి నిరసనగా దీక్ష చేపట్టిన చంద్రబాబు డీజీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని అన్న చంద్రబాబు.. ఏం చేస్తావో చేసుకో… నీకు చేతనైంది చేసుకో, నీ సంగతి చూస్తా అని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటి పార్టీ ఆఫీస్‌పై దాడి జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తే స్పందించని డీజీపీ కూడా ఒక డీజీపీయా? అని నిలదీశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా దీక్షకు దిగితే… దీనిని కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నించావ్, కాన్వాయ్ రూటు మారుస్తావో, నీకెంత దమ్ముందో చూస్తాను, ఏం చేయగలవో చేసుకో… అంటూ దీక్ష స్థలం నుంచి డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని దొరికినా అరెస్టు చేయకుండా దగ్గర ఉండి సాగనంపడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ రాష్ట్రపతి పాలన కోరలేదు. కానీ మీరు బరితెగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. అందుకే రాష్ట్రపతి పాలన కోరాం. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయాలని చూస్తోంది… ఇది వారు వారి పతనానికి నాందిపలికినట్లే. దాడులు అడ్డుకోలేకపోతే పోలీస్ వ్యవస్థను మూసేయాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎన్టీఆర్ భవన్.. 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయం. దాడి జరిగిన చోటే దీక్ష చేస్తున్నా. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై పోరాటం. మీరు తట్టుకోలేరు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.