భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ ఉత్సాహంగా, ఉల్లాసంగా కొంత సమయం గడిపారు. చాలాకాలం తర్వాత చంద్రబాబు హుషారుగా చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఎంపీలతో ఛలోక్తులు విసురుతూ, నవ్వుతూ సరదాగా సమయం గడిపారు. అంతకుముందు కూడా, ప్రధాని మోదీతో ఒకే వేదికపై ఉన్న చంద్రబాబు హుషారుగా కనిపించారు. చాలా కాలం తర్వాత మోదీ, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించడం విశేషం. ఈ సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో చంద్రబాబు సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.
అంతకుముందు, సమావేశం సమయానికి కాస్త ముందుగానే రాష్ట్రపతి భవన్కు చేరుకున్న చంద్రబాబును జాతీయ మీడియా ప్రతినిధులు పలకరించారు. చాలాకాలం తర్వాత చంద్రబాబు ఢిల్లీలో కనిపించడంతో పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆయనను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులు, జగన్ అస్తవ్యస్థ పాలన, జాతీయ రాజకీయ పరిణామాలపై వారితో చంద్రబాబు ఇష్టాగోష్ఠి జరిపారు.
ఈ సందర్భంగా జగన్ సర్కారుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలో నెట్టేశారని, జగన్పై తిరుగుబాటు చేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియా ముందు జగన్ గుట్టు విప్పారు చంద్రబాబు. ఈ విషయం తెలిసి జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Comments 1