విజన్ 2020…ఈ మాట చెప్పగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ మాట చెబితే చాలా మంది నవ్వారు. ఐటీ రంగంలో, టెక్నాలజీలో హైదరాబాద్ కు ప్రపంచ పటంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తానని ఆనాడు చంద్రబాబు అంటే ఆయనది అత్యాశ అన్నారు. బిల్ గేట్స్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి…వాజ్ పేయితో హైటెక్ సిటీ గురించి చర్చిస్తే…అదంతా వృథా ప్రయాస అన్నారు.
కట్ చేస్తే…20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ప్రపంచ ఐటీ రంగంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. దేశంలోనే ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ అత్యంత సౌకర్యవంతమైన నగరంగా అవతరించింది. అందుకే, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు…పార్టీలకతీతంగా చాలామంది అంగీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విజన్-2047 కు మద్దతు తెలిపారు. అధికార పక్షంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా…తాను ప్రజల పక్షమేనని మరోసారి నిరూపించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని, వ్యక్తిగతంగా మోదీ అంటే తనకు గౌరవముందని వెల్లడించారు. మోదీ గొప్ప దార్శనీకుడని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నేత అని అన్నారు. మోదీ విజన్ తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను మోదీ విధానాలను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. తాను కేవలం ప్రత్యేక హోదా కోసం మాత్రమే మోదీ మీద పోరాటం చేశానని చెప్పారు. పార్టీలు వేరయినప్పటికీ తాను, మోదీ విజన్ ఉన్న నాయకులమని అన్నారు. రూ.500కు పైన ఉన్న పెద్ద నోట్లను కూడా రద్దు చేయాలని సూచించారు. తాను మోదీ ఆలోచనలకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధమన్నారు.
టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్: ది నీడ్ టు కీప్ ఫైటింగ్ అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. 2050 నాటికి భారత్ దే అగ్రస్థానం అన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు పలువురు వర్చువల్ గా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది.