మరో 60 రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రా.. కదలిరా! సభకు జనసందోహం.. నభూతో అన్న విధంగా తరలి వచ్చింది. అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ అన్నట్టు.. నేల ఈనిందా? అన్నట్టుగా రా.. కదలిరా! సభకు జనం తరలి వచ్చారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అదేవిధంగా ప్రజలుసైతం వచ్చారు. ఈ తొలి స్టెప్పులోనే టీడీపీకి బూస్ట్ ఇచ్చినట్టయిందని అంటున్నారు సీనియర్ నాయకులు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా! అని పిలుపునిస్తే ఒక ప్రభంజనమైంది. ఈరోజు మీ అందరి సహకారం అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా.. కదలిరా! అని పిలుపునిస్తున్నా. నేను.. పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత.
‘రా కదలి రా’ కార్యక్రమాన్ని పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి ప్రారంభించామని చంద్రబాబు అన్నారు. కనిగిరిలో అఖండ స్వాగతం పలికిన అందరికీ అభినందనలు తెలిపారు. “కనిగిరి సభ ద్వారా పిలుపునిస్తున్నా.. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావా లి’. అభివృద్ధి – సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్. గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. మీకు ఇచ్చేది పది రూపాయలు అయితే.. దోచుకునేది వంద రూపాయలు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి, వారి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడం. కానీ, రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన లేదు’’ అని విమర్శించారు.
కాగా, ప్రస్తుతం వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను నియోజకవర్గాలను దాటించడంపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సొంత పార్టీ నేతలపైనే వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదన్నారు. “యర్రగొండపాలెంలోని చెత్త.. కొండపిలో బంగారం అవుతుందా? ఈ మార్పులు ఎందుకు? ఓడిపోయే స్థానాలను బీసీలకు ఇచ్చి ఏం చేస్తారు? ఇదేనా మీ బీసీల మేనిఫెస్టో?“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. “2029 నాటికి ఏపీ నంబర్ వన్ కావాలని ప్రణాళికలు రచించాం. నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా’’ అని చంద్రబాబు చెప్పారు.