ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే వెంట్రుకతో కొండను లాగాలనుకుంటున్నట్లుగా ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి..ఆ జిల్లాలో అత్యధికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లకు జగన్ గేలం వేశారని విమర్శలు వస్తున్నాయి. అయితే, ఎన్టీఆర్ మీద అంత ప్రేమ ఉన్న జగన్…అన్న క్యాంటీన్లను ఎందుకు తీసివేశారని, విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసివేశారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో స్పందించారు.
ఎన్టీఆర్ పేరుతో ఉన్న 14 పథకాలను రద్దు చేసిన జగన్…ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ హడావిడిగా జిల్లాల విభజన చేశారని, అలా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల పునర్విభజన జరగడం దురదృష్టకరమని అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకు ధరలు, పెట్రో ధరలతో జనం అల్లాడిపోతున్నారని, అటువంటి ప్రజల నెత్తిన కరెంటు చార్జీల భారం కూడా వేయాలని చూడడం దారుణమన్నారు.
2022 మే 29 నుంచి 2023 మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు టీడీపీ ఆవిర్భవించి ఈ ఏడాదితో నాలుగు దశాబ్దాలు పూర్తవుతుందని, ఈ రెండు చరిత్రాత్మక సందర్భాలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలని, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపైనా పోరాడాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఉండి పోరాడే వారికి పార్టీ నాయకత్వం సముచిత స్థానం ఇస్తుందని చంద్రబాబు చెప్పారు.