‘రా..కదలిరా’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభకు వేలాది సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ కు ఓటేసి అనర్హుడిని అందలం ఎక్కించామని ప్రజలు బాధపడుతున్నారని, జగన్ కు రద్దులు, కూల్చివేతలు, దాడులు కేసులు తప్ప ఇంకేం తెలియవని ఎద్దేవా చేశారు. జగన్ కు ఓటేసి రాతియుగం వైపు వెళ్తారా? టీడీపీకి ఓటేసి స్వర్ణయగం వైపు వెళ్తారా అని ప్రజలను ప్రశ్నించారు.
జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ అంటూ యువతను నిరుద్యోగులుగానే మిగిల్చాడని విమర్శలు గుప్పించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత బాధలు తీరుతాయని చెప్పారు. ఇక, నంద్యాల ప్రజల జోరు చూస్తుంటే ఇక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వ పతనం మొదలైందనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ జన సునామీ చూసి తాడేపల్లి ప్యాలెస్ గజగజ వణుకుతోందని చెప్పారు.
ఓర్వకల్లుకు 15 నెలల్లో విమానాశ్రయం తెచ్చిన ఘనత టీడీపీదని చెప్పుకొచ్చారు. సీమకు 350 టీెఎంసీల నీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని,అందుకే టిడిపి-జనసేన కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టిడిపి-జనసేన జెండాను యువత పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగనన్న వదిలిన బాణం షర్మిల ఎక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా కేసులో ఎన్నో కుట్రలు చేశారని, ఆఖరుకు ఆయన కూతురు సునీతపై కూడా కేసు పెట్టారని మండిపడ్డారు.