ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోకి వర్మ ఎంట్రీ ఇచ్చి తన లాజిక్కులతో మంత్రులను ఇరకాటంలో పెట్టడంతో జగన్ ఇరకాటంలో పడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన జగన్…భారతి సిమెంట్ రేట్లు తగ్గించరంటూ చంద్రబాబు చురకలంటించారు. జగన్ చేపల మార్కెట్ల గురించి మాట్లాడుతుంటాడంటూ ఎద్దేవా చేశారు.
ఇక, ఇన్నాళ్లూ ఊరించి ఉద్యోగులకు జగన్ చేసిన పీఆర్సీ ప్రకటనపై చంద్రబాబు సెటైర్లు వేశారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ప్రకటించారని విమర్శించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషంగా ఉన్నారని, కానీ, ఉద్యోగులు కాదని అన్నారు. రిటైర్ అయిన వారికి ఇవ్వడానికి డబ్బులు లేక ఉద్యోగుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని ఆరోపించారు.
పులివెందుల తరహా రాజకీయాలు ఇలాగే ఉంటాయని జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. గతంలో తాము 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. స్థానిక నేతలు ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని లోకల్ నాయకులకు స్పష్టం చేశారు. తాను వచ్చినప్పుడు హడావిడి చేసి, ఆ తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారని అన్నారు.