సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. సీఎం సొంత ఇలాకాలో సరైన బస్టాండ్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే…మరికొన్ని చోట్ల బస్టాండ్ పై కప్పు ఊడిపోయి జనం ఆస్పత్రులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చు ఊడి మహిళకు గాయాలు కావడం సంచలనం రేపుతోంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ తలపై ఆ పెచ్చులు పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఆ మహిళకు తీవ్ర గాయాలు కావడం విచారకరమని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో కొత్త నిర్మాణాల ఊసే లేదని, కనీసం ఉన్న నిర్మాణాలను సరిగా నిర్వహించడం కూడా చేతకావడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆర్టీసీ ప్రయాణికులకు జగన్ ప్రభుత్వం కల్పించే భద్రత ఇదేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఆర్టీసీ బస్సు ఎక్కితే చక్రాలు ఎప్పుడు ఊడి పడతాయో తెలియని, బస్సు ఏ గుంతలో దిగబడుతుందో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బస్సులో ఉన్న వాన పడితే తడవకుండా గొడుగు పట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఒకవైపు టికెట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం పంపుతున్న జగన్… ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మాత్రం బాధ్యత తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని చాపాడు మండలంలో సాగు మోటార్ కు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిపడి ముగ్గురు రైతులు మరణించడంపై కూడా చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనతో పాటు మరో రెండు చోట్ల కూడా విద్యుత్ ప్రమాదాలలో ఇద్దరు మృత్యువాతపడ్డారని, ఈ రెండు ఘటనలు అత్యంత విచారకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో విద్యుత్ ప్రమాదాల వల్ల 675 మంది చనిపోయారని, 143 మంది గాయపడ్డారని చంద్రబాబు అన్నారు.
అదే సమయంలో 681 పశువులు చనిపోయాయని, ఈ లెక్కలు తాను చెబుతున్నారు కాదని, కేంద్ర మంత్రి పార్లమెంటులో స్వయంగా చెప్పారని అన్నారు. దక్షిణాదిలోనే విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రంలో ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం తెలిసిన జగన్ కు విద్యుత్ ప్రమాదాలను నివారించడం, అందుకు అవసరమైన సిబ్బందిని నియమించి తగు చర్యలను తీసుకోవడం తెలియదని మండిపడ్డారు. మీటర్లపై వేల కోట్ల స్కాములు చేయడం, కరెంటు చార్జీలతో జనాన్ని బాదడం మాత్రమే తెలుసు అని ఎద్దేవా చేశారు.