సీఎం జగన్ పై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఒకవేళ పొరపాటున 2004లో జగన్ సీఎం అయి ఉంటే హైదరాబాద్ నేడు అంతర్జాతీయ స్థాయి నగరం అయ్యుండేది కాదని చురకలంటించారు. తాను విజన్‌తో చేసిన పాలన వల్లే నేడు హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని, జగన్ లాగా ప్రజావేదికలు కూల్చేసి,ప్రాజెక్టులు ఆపేస్తే…హైదరాబాద్ ఏమై ఉండేదోనని చంద్రబాబు అన్నారు.
హైటెక్ సిటీ, ఐఎస్బి లాంటి వాటిని కూల్చేసి, ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను జగన్ వంటి నేతలు అపేసి ఉండేవారేమోని చెప్పారు. తనపై కక్షతో అమరావతిని శ్మశానం చేయాలని చూస్తున్న జగన్‌కు 2004లో అవకాశం వచ్చి ఉంటే హైదరాబాద్‌ను ఎంత నాశనం చేసేవారో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు తెలంగాణ ప్రధాన ఆదాయ వనరుగా, ఉపాధి కేంద్రంగా, అభివృద్దికి చిరునామాగా హైదరాబాద్ ఉన్న తరహాలో తాను అమరావతి కూడా ఉండాలని భావించానని, కానీ, జగన్ వల్ల అది సాధ్యం కాలేదని అన్నారు.
ఉడతల కారణంగా కరెంట్ తీగలు తెగిపోవడం, ఎలుకలు మద్యం తాగడం, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్ల నుంచి మాయం అవడం జగన్ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము మాయం కావడానికి సీఎఫ్ఎంఎస్ విధానంలో లోపం కాదని.. వైసీపీ విధానంలోనే లోపమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు పాస్ అయితే.. ఏపీలో కేవలం 67 శాతం మంది మాత్రమే పాస్ కావడమే నాడు-నేడు కార్యక్రమమా అని ప్రశ్నించారు.
2019 టీడీపీ ఓటమితో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇప్పుడు ప్రత్యక్షంగా అంతా చూస్తున్నారని, ప్రజల్లో ఇప్పటికే తిరుగు బాటు మొదలయ్యిందని చెప్పారు. వైసీపీ కార్యక్రమాలకు జనాదరణ లేదని అన్నారు. టీడీపీ చేస్తున్న ప్రజా పోరాటాలు, కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ విజయవాడకు చెందిన ముస్లింలు అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించనున్నారు. వారు చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో చాదర్‌ను స్వీకరించారు.