ఏపీ హైకోర్టుపై మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అమరావతి భూముల వ్యవహారంపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని, కానీ, దానిపై హైకోర్టు స్టే ఇచ్చిందని తప్పుబట్టారు. న్యాయస్థానంతో ప్రభుత్వం పోరాడుతోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఖండించారు. తాజాగా జస్టిస్ చంద్రు కామెంట్లను ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.
ఒక ఆర్థిక నేరస్థుడికి జస్టిస్ చంద్రు మద్దతివ్వడం ఏమిటని చంద్రబాబు ధ్వజమెత్తారు.ఒక జడ్జి ఎక్కడ్నుంచో వచ్చి ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటున్నారని, కానీ, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితుల గురించి వాళ్లకేం తెలుసని అన్నారు. ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా అని ప్రశ్నించారు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పదవులు కావాలని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాని మండిపడ్డారు. ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేసి, ఆయన కుమారుడికి ఏపీలో పదవి దక్కడంతో జగన్‌ను పొగుడుతున్నారని మండిపడ్డారు.
లోక్ సభలో మిథున్ రెడ్డి వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. ఢిల్లీలో వైసీపీ ప్రభుత్వం బిచ్చం ఎత్తుకుంటోందని, ఏపీని ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వేడుకుంటోందని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి, ఇప్పుడు అడుక్కుంటే సరిపోదని దుయ్యబట్టారు. రెండు కళ్లుగా ఉన్న అమరావతి, పోలవరాన్ని పొడిచేసిన జగన్ ఏపీని గుడ్డిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ఏపీని ఇంత భ్రష్టు పట్టించిన సీఎం జగన్ ఒక్కడే అని మండిపడ్డారు.
3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ షేక్ షా వలి, నూర్ భాషా నేతలు పలువురు టీడీపీలో చేరారు.మైనారిటీల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని, కలాంను రాష్ట్రపతిగా చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందన్నారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ నేతలు, హైదరాబాద్‌లో హైటెక్ సిటీని చూడాలని హితవు పలికారు.