ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న కారణంతో పలువురు టిడిపి కార్యకర్తలను, నేతలను సీఐడీ అధికారులు అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి కేంద్ర కార్యాలయం మీడియా కోఆర్డినేటర్ నరేంద్రను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొన్న రాత్రి నరేంద్రను అరెస్టు చేయగా నాటికీయ పరిణామాల మధ్య నిన్న రాత్రి ఆయనకు బెయిల్ లభించింది.
నిన్న సాయంత్రం సిఐడి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట సిఐడి పోలీసులు నరేంద్రను హాజరు పరిచారు. అయితే, కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద నరేందర్ ను పోలీసులు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని నరేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో, ముందు నరేంద్రకు జిజిహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని జడ్జి ఆదేశించారు. దాదాపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వైద్యుల నివేదిక అందుకున్న తర్వాత నరేంద్రకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
ఇక, సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలోని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్ కుమార్, ఇతర టిడిపి నేతలు అరెస్టుపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రవీణ్ ఇంటిపై వైసీపీ మూకలు దాడి చేస్తున్న సమాచారం పోలీసులకు ఉందని, అయినా అడ్డుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. రౌడీల దాడి నుంచి రక్షించాల్సిన పోలీసులు దాడి జరిగిన తర్వాత బాధితులపై అక్రమ కేసు పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు.
ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్న పోలీసులు…వైసీపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పోలీసుల తీరు డిపార్ట్మెంట్ కి అవమానకరమని, ప్రవీణ్ ను, టిడిపి నేతలను తక్షణం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రవీణ్ పై దాడి చేసిన రౌడీలను అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.