మున్సిపల్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో టీడీపీ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు…జగన్ పై మండిపడ్డారు. తన చెల్లెలు షర్మిలను జగన్ మోసం చేశారని, అందుకే షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ పిరికి పంద అని, జగన్కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు బస్తీమే సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులెవరో జనానికి తెలుసన్న చంద్రబాబు… ఏం పీకారని జగన్కు ఓటేస్తారని నిప్పులు చెరిగారు.. జగన్ కు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఛాలెంజ్ చేశారు.
టీడీపీ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే… జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశాడని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులతో మత సామరస్యం దెబ్బతిందని, ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి ఎన్టీఆర్ ఆత్మగౌరవం కల్పించారని, జగన్ రాజారెడ్డి రాజ్యాంగంతో అది పోయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని, చరిత్రలో ఎన్నడూ ఇన్ని ఏకగ్రీవాలు జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జగన్… ఏబీసీడీ పాలన తెచ్చారని, ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన… బీ అంటే బాదుడు, సీ అంటూ కరప్షన్, డీ అంటే డిస్ట్రక్షన్ (విధ్వంసం) అని చంద్రబాబు అభివర్ణించారు. అమ్మఒడి రూ.14 వేలు చేసి… నాన్న బుడ్డి (మద్యం) రూ.36 వేలు చేశాడని సెటైర్ వేశారు. నాడు పాదయాత్రలో ముద్దులు నేడు సీఎం అయ్యాక పిడిగుద్దులు గుద్దుతున్నాడని జగన్ నుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏపీని జగన్ అప్పుల్లో ముంచెత్తారని, దేశంలో ఎక్కువగా చేసిన అప్పులు చేసిన సీఎం జగనే అని చంద్రబాబు దుయ్యబట్టారు. 22 నెలల్లో లక్షా 63 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, దేశంలో అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ అమ్మేస్తున్నారని, జగన్ దిగిపోయే నాటికి 4 లక్షల కోట్ల అప్పులు అప్పు ఏపీ నెత్తిన పెడతారని దుయ్యబట్టారు. ఇప్పుడు జగన్ చేసే అప్పులు రేపు జనం కట్టాలని, జగన్ అవినీతి వల్లనే అప్పులు పెరుగుతున్నాయని ఆరోపించారు
చిత్తూరు కార్పొరేషన్లో, తిరుపతిలో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీడియో రికార్డింగ్ పరిశీలన జరిగే వరకూ అక్కడ ఏకగ్రీవాలను ప్రకటించకూడదని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారులు, పోలీసుల సహకారంతో వైసీపీ నేతలు ఫోర్జరీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ తరహా ఫిర్యాదుల వల్లే అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ తీయాలని, ఆ రికార్డును భద్రపరచాలని ఎస్ఈసీ ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ తరహా కుట్రపూరిత ఉపసంహరణలపై ఎస్ఈసీ కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.