ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి ఇదే లాస్ట్ చాన్స్ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఆయనను ప్రజలు తిట్టిపోస్తున్నారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పాలనా తీరు, విద్వేష రాజకీయాల కారణంగా తనను ఎన్నుకున్న పులివెందులకూ చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి తన రివర్స్ పాలనతో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సమాధానం చెప్పలేక, విద్వేష రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడని చంద్రబాబు దుయ్యబట్టారు. బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి దోషులను కాపాడడం స్థానిక ప్రజలకు కూడా మింగుడు పడడంలేదని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు జగన్పై విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు అదే చివరి చాన్స్ అవ్వనుందని.. ప్రజల్లో ఎక్కడ చూసినా ఈ చర్చే కనిపిస్తోందని బాబు అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్లో కూడా వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచిపోతారాని వివరించారు.
అన్ని వర్గాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న పరిస్థితిని రాజకీయంగా టీడీపీ నేతలు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు 126 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు రివ్యూలు చేశారు.
నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు, మెంబర్ షిప్, పార్టీ కార్యక్రమాల నిర్వహణపైనా నేతలతో అధినేత సమీక్షలు జరిపారు. గ్రామస్థాయి వరకు గ్రూపులు అనే అంశమే ఉండకూడదని…ఇంచార్జ్ లు అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు.
తమ్ముళ్లకు క్లాస్..
ఇంచార్జ్ లతో రివ్యూల అనంతరం వారి పనితీరులో మార్పు వచ్చిందా లేదా అనే అంశంపైనా సమాచారం తెప్పించుకుంటు న్నామని చంద్రబాబు అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా నేతలు పనితీరు మెరుగుపరుచుకోకపోతే దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని నేతలకు చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.
సమీక్షల అనంతరం కూడా కొందరు నేతలు యాక్టివ్ అవ్వలేదని తన దృష్టికి వచ్చిందని, అటువంటి నేతల విషయంలో త్వరలో నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు.