జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? అని ప్రశ్నించారు. ప్రాణాలు పోతున్నా స్పందించరా అంటూ నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు.
నాటుసారా తాగి 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపైనా చర్యలు చేపట్టాలని కోరారు.
కుళ్లిన కోడిగుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం, ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారీ ఉదాసీనత కారణంగా ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు రోజుల్లో 15 మంది మృతి చెందడం జంగారెడ్డిగూడెంలో కలకలం సృష్టిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృత్యువాత పడటం మిస్టరీగా మారింది. కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం విషాదం మిగుల్చుతోంది. వీరిలో ఎక్కువ మందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా మద్యం తాగే అలవాటు ఉన్నా.. ఎప్పుడూ కనీసం అస్వస్థతకు గురికాలేదని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సారా కల్తీ కావడం వల్లే చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం కల్తీసారా తయారీదారులపై చర్యలు తీసుకోవడమే గాక.. తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి ఇప్పటికైనా .. ప్రభుత్వం రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
https://twitter.com/SreenivasC14/status/1502184009564323840