అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు షాకివ్వడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో నిలబడుతున్న టీడీపీ అభ్యర్థులను భయపెట్టి వైసీపీలో చేర్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించి ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
రేణిగుంట ఎయిర్పోర్టులో హైటెన్షన్ ఏర్పడింది. గంటసేపుగా చంద్రబాబు ఎయిర్ పోర్టులో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. లాంజ్ నుంచి బయటకు వెళ్లనియ్యకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చంద్రబాబు ఎయిర్ పోర్టులోనే బైఠాయించారు.
తాను కలెక్టర్, ఎస్పీని కలవడానికి వెళుతున్నానని చెప్పినా..పోలీసులు వినలేదు. వాళ్లను విమానాశ్రయానికి పిలిపిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే, తాను వారిని పిలిపించుకునేంత గొప్ప వ్యక్తిని కాదని చంద్రబాబు హుందాగా వ్యవహరించారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనన్నారు. తనను మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని చంద్రబాబు ఖండించారు. ‘‘నేనేమైనా హత్య చేయడానికి వెళుతున్నానా.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. ప్రతిపక్ష నేతను నేను. నన్నెందుకు నిర్బంధించారో చెప్పండి’’ అని చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం దాటవేశారు.
వాస్తవానికి నగరంలోని గాంధీ కూడలి వద్ద చంద్రబాబు ధర్నా చేయాల్సి ఉంది.ఈ కార్యక్రమంలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారని అంచనా. అయితే, ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ నేతలు పోలీసుల అనుమతి కోరగా కోవిడ్ సాకుతో వారు నిరాకరించారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని, అనుమతివ్వబోమని చిత్తూరు డీఎస్పీ స్పష్టం చేశారు.
అంతకుముందు, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులను పోలీసులు నిర్బంధించారు. దీంతో చిత్తూరు జిల్లా ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడుకుతోంది.