దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పటి పేదరికం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందఅన్నారు. భవిష్యత్ లో ప్రపంచంలోనే భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు చాలా మంది తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేశారని.. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని.. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన సమయమిదని చంద్రబాబు అన్నారు.
పేదరికం నుంచి.. నేడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని చంద్రబాబు చెప్పారు. రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామని, సొంతగా ఆయుధాలు తయారు చేసుకునే స్థాయికి చేరామని అన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, క్రమశిక్షణను అందరిలో పెంచాలని అన్నారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు కృషిచేయాలని, ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని సూచించారు.
నాడు విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభవించామన్న బాబు.. ఇప్పుడు దేశాన్ని ప్రపంచం లోనే అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే కీర్తి గడించిన మేధావులు ఉండే దేశం.. భారతదేశమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు.. ప్రపంచంతో పోటీపడేలా చేశాయని అన్నారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో విషయాల్లో ముందున్నారని చెప్పారు. ఆయన తెచ్చిన పథకాలు.. పేదల తలరాతలను మారుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ను కూడా స్మరించుకోవాలని అన్నారు. పేద ప్రజల మేలుకోసమే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ భావాలతో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. దేశ సమైక్యత విషయంలో టీడీపపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
టెలీకమ్యూనికేషన్ రంగంలో మార్పులకు టీడీపీ నాంది పలికిందని, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని, టీడీపీ చేసిన కృషి కారణంగా ఐటీ రంగం అభివృద్ధి చెందిదని అన్నారు. అయితే.. అవినీతి అనేది చీడలా మారి నాశనం చేస్తుందని.. అవినీతి ఉన్నచోట అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రజా జీవితం కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదని అన్నారు. నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అన్న చంద్రబాబు.. నదీ జలాలు సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కూడా కృషి చేయాలని కోరారు. అందరూ కలిసి భారతదేశాన్ని నవశకం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బందికి, ఇతర స్టాఫ్ కు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/IFRxYDsQvK
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2022
Comments 1